కోతులనడుమ గ్రామానికి 2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ శివాలయం ఆలయ భాగ్యం
లింగ సముద్రం చెరువు వద్ద స్థలాన్ని పరిశీలించిన గురుస్వామి కాల నాగ మహర్షి
భిక్షాటన చేసైనా మహా యజ్ఞాన్ని పూర్తి చేస్తామన్న స్వామీజీ
త్వరలోనే భూమి పూజ సర్పంచ్ మాట్ల లింగయ్య, ఉపసర్పంచ్ దుండ్ర శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి ఒక అరుదైన ఆధ్యాత్మిక భాగ్యం దక్కింది. హిమాలయ పర్వతశ్రేణుల్లో పరమశివుని కోసం కఠోర తపస్సు ఆచరించిన ప్రముఖ యోగి గురు స్వామి కాల నాగ మహర్షి, వారి శిష్యులు స్వామి కాల మహేశ్వర మహర్షి గారు ఆదివారం కోతులనడుమ గ్రామానికి విచ్చేశారు. సుమారు రూ. 2 కోట్ల భారీ వ్యయంతో గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ పశుపతినాథ్’ ఆలయాన్ని నిర్మించేందుకు స్వామీజీ సంకల్పించారు.
లింగ సముద్రం చరిత్రే రప్పించింది:
గతంలో ఈ గ్రామ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఇక్కడొక భవ్యమైన శివాలయం నిర్మించాలని స్వామి వారికి దివ్య సంకల్పం కలిగింది. ఈ క్రమంలో ఆదివారం గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య, ఉపసర్పంచ్ దుండ్ర శ్రీనివాస్ యాదవ్, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులతో స్వామీజీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలోని ఎన్ఎచ్ 563 అనుకోని వున్న చెరువు దగ్గర ‘లింగ సముద్రం’ ప్రాంతానికి పురాతన కాలం నుండే శివలింగాలతో విశిష్ట చరిత్ర ఉందని గ్రామ పెద్దల ద్వారా తెలుసుకున్న స్వామీజీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.సాక్షాత్తూ ఆ పరమశివుడే తనను ఈ పుణ్యభూమికి పంపించారని ఆయన పేర్కొన్నారు.
భిక్షాటన చేసైనా పూర్తి చేస్తాం.
అన్ని జిల్లాల ప్రజలు కోతులనడుమ గ్రామం పేరు చెప్పుకునే స్థాయిలో ఆలయ నిర్మాణం ఉంటుందని స్వామి కాల నాగ మహర్షి స్పష్టం చేశారు. “ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేయడానికి అవసరమైతే భిక్షాటన చేసైనా సరే నిధులు సమకూరుస్తాం. గ్రామస్థులందరూ తమకు తోచిన సహాయం అందిస్తూ, ఆశీర్వాదాలు అందిస్తే చాలు” అని స్వామీజీ పిలుపునిచ్చారు.
త్వరలోనే భూమి పూజ:
పండితుల సూచనల మేరకు త్వరలోనే భూమి పూజకు శుభ ముహూర్తాన్ని నిర్ణయించి, గ్రామస్థులందరి సమక్షంలో ప్రకటిస్తామని స్వామీజీ తెలిపారు. గ్రామానికి దక్కిన ఈ అద్భుత అవకాశాన్ని గ్రామస్థులందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని,ఆ పరమశివుని కృపాకటాక్షాలు గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య,ఉపసర్పంచ్ దుండ్ర శ్రీనివాస్ యాదవ్ ఒక సంయుక్త ప్రకటనలో కోరారు.
ఈ కార్యక్రమం లో శ్రీపతి రవీందర్ గౌడ్,శ్రీపతి మొగిలి, శ్రీపతి బిక్షపతి,గోపగోని తిరుపతి, మాట్ల శ్రీనివాస్,మాట్ల రాజయ్య,చిరంజీవి, పల్లెవెన రాజు యాదవ్,పల్లెవెన రవీందర్ యాదవ్, పల్లెవెన ఎర్రయ్య,పల్లెవెన మల్లయ్య,ఎర్రోళ్ల జగన్, ఎర్రోళ్లచిరంజీవి,ఎర్రోళ్ల సురేష్,ఎర్రోళ్ల రాజయ్య, ఎర్రోళ్ల రాజబాబు గ్రామ పెద్దలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

