📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonజనగామ లో అట్టహాసంగా కలెక్టర్ కప్-2026 జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ మీట్ ప్రారంభం

జనగామ లో అట్టహాసంగా కలెక్టర్ కప్-2026 జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ మీట్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

విద్యతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి..

ప్రతి విద్యార్థికి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించడమే లక్ష్యం..

క్రీడలతో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయస్ఫూర్తి అలవడతాయి..

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): జిల్లా క్రీడా రంగంలో మరో ప్రతిష్ఠాత్మక ఘట్టానికి వేదికైంది. కలెక్టర్ కప్-2026 జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ మీట్ కార్యక్రమం ఆదివారం, జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, కలెక్టర్ కప్ ఆటలను ఆరంభించారు. అనంతరం వందేమాతరం, రాష్ట్ర గీతాలాపన చేశారు. వివిధ మండలాల పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడాకారులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అంతే ముఖ్యమని, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రతి పాఠశాలలోని ప్రతి విద్యార్థికి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే కలెక్టర్ కప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహుమతుల సంఖ్య కంటే విద్యార్థులందరూ అన్ని స్థాయిల్లో పాల్గొనడమే ముఖ్యమని స్పష్టం చేశారు.

చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, యోగాసనాలను ఇండోర్ క్రీడలుగా ఎంపిక చేశామని, వీటికి పెద్ద మైదానాలు, ఖరీదైన పరికరాలు అవసరం లేదని తెలిపారు. కేజీబీవీ విద్యార్థినుల నుంచి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ వీటిని సులభంగా నేర్చుకుని ప్రతిరోజూ సాధన చేయవచ్చని పేర్కొన్నారు.

చెస్ ద్వారా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, క్యారమ్స్ ద్వారా ఓర్పు, ఏకాగ్రత, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ద్వారా వేగం, అప్రమత్తత, యోగాసనాల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతాయని వివరించారు. క్రీడలు, చదువు ఒకదానికొకటి పూరకాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను ప్రతిరోజూ ఆటలకు ప్రోత్సహించాలని, అదనపు తరగతుల కోసం క్రీడా పీరియడ్లను రద్దు చేయవద్దని కోరారు. పీఎం శ్రీ పాఠశాలలు, కేజీబీవీలలో బాస్కెట్ బాల్ కోర్టులు, టేబుల్ టెన్నిస్ సదుపాయాలు కల్పిస్తున్నామని, వాటిని విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ క్రమంలో డీసీపీ మాట్లాడుతూ, జిల్లాలో తొలిసారిగా కలెక్టర్ కప్ నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. మొబైల్ ఫోన్లు, స్క్రీన్‌లకు అలవాటు పడుతున్న విద్యార్థులను క్రీడల వైపు మళ్లించడం అవసరమని, క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి, క్రమశిక్షణ అలవడతాయని వివరించారు. జాతీయ స్థాయిలో రాణించిన వారికి స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. చుక్కా రామయ్య వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

అనంతరం డీసీపీతో కలిసి జిల్లా కలెక్టర్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ ఆడి విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపారు. విద్యార్థులు ప్రదర్శించిన క్రీడా విన్యాసాలు, యోగాసనాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీవైఎస్ఓ నరసింహా రావు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి గోర్ సింగ్, జీసీడీఓ గౌసియా బేగం, అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.