విద్యార్థుల చేతుల్లో పాఠశాల పాలన..
బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం
ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి :
పిట్టల ఎల్లయ్యపల్లి: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిట్టల ఎల్లయ్యపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బాలల దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో బోధన కార్యక్రమాలను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను పోషిస్తూ పాఠాలు బోధించడం, పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ద్వారా నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ప్రవర్తన, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ మాట్లాడుతూ, పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, పట్టుదల, సేవాభావంతో విద్యను అభ్యసించాలని, సమాజ అభివృద్ధికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, విద్య పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు సుమలత, ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పద్మ, ఆయా మానస, వార్డు సభ్యురాలు సుస్మిత, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

