అనుమతులు లేకుండా ఆసుపత్రి నడిపితే కఠిన చర్యలు..
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో పలు ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ శనివారం వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డా. సంధ్యతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా డా. వాణిశ్రీ మాట్లాడుతూ, ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు పొందిన తర్వాతే నిర్వహించాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆసుపత్రులకు సంబంధించిన రికార్డులు, రోగుల వివరాలు, సిబ్బంది వివరాలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టంలోని నియమ నిబంధనలను ప్రతి యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను పాటించడం ప్రతి ఆసుపత్రి బాధ్యత అని ఆమె తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై తదుపరి తనిఖీల్లో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

