పోరుమామిళ్ల హోలీ రోసరి చర్చిలో ఘనంగా 37వ వర్ధంతి వేడుకలు ఏకతాటిపైకి వచ్చిన దళిత క్రైస్తవులు
పోరుమామిళ్ల నవంబర్ 21ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని చారిత్రాత్మక హోలీ రోసరి చర్చి నందు దళిత క్రైస్తవుల ఆశాజ్యోతి,సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన కడప మేత్రాసనం గురువులు రెవరెండ్ ఫాదర్ ఆర్.జోసెఫ్ స్వాములవారి 37వ వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు క్రైస్తవ గురువులు,ప్రజాసంఘాల నాయకులు,దళిత క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ప్రముఖ క్రైస్తవ గురువులు డేవిడ్ ఫాదర్, ఫాదర్ సునీల్ కుమార్,ఫాదర్ సురేష్, పోరుమామిళ్ల డీన్ రెవరెండ్ జాల విజయ్ భాస్కర్ స్వామి తదితర గురువుల బృందం సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు, నివాళుల కార్యక్రమం నిర్వహించారు.ఫాదర్ ఆర్.జోసెఫ్ స్వాములవారు సమాజానికి అందించిన సేవలను, దళిత క్రైస్తవుల అభ్యున్నతి కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు.దళిత క్రైస్తవులలో చైతన్యం, ఐక్యత,సామాజిక సమానత్వం పెంపొందించేందుకు ఫాదర్ జోసెఫ్ స్వాములవారు చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు.ఆయన ఆశయాలు, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.సమాజంలో అణగారిన వర్గాలకు గౌరవం, సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పించాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా దళిత క్రైస్తవులందరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరాన్ని నాయకులు నొక్కిచెప్పారు.వివిధ ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్ధంతి వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. కులమత భేదాలకు అతీతంగా మానవత్వం,సమానత్వం, సోదరభావం వెల్లివిరిసే సమాజ నిర్మాణమే ఫాదర్ జోసెఫ్ స్వాములవారికి మనం అందించే నిజమైన నివాళి అని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో సగిలి గడ్డం గంగరప్ప,సుందరయ్య,రత్నయ్య,బొజ్జ స్టీఫెన్,దాసరపల్లి మణి,పుల్లయ్య,భాస్కర్ తదితరులు పాల్గొని ఫాదర్ ఆర్.జోసెఫ్ స్వాములవారికి ఘన నివాళులు అర్పించారు.37 సంవత్సరాలు గడిచినా ఆయన సేవలు,త్యాగాలు,సామాజిక చైతన్యం కోసం చేసిన కృషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని,ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దళిత క్రైస్తవుల హక్కులు,అభ్యున్నతి,ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

