అర్హులైన ప్రతి కుటుంబం వెంటనే నమోదు చేసుకోవాలి..
దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి): పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప పథకమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్ అన్నారు. ఈ పథకం నమోదు ప్రక్రియ మండలంలో ప్రారంభమైందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా ఎంతో ఉపయోగకరమని అన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా బీమా ద్వారా ఆదుకునేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు.
దేవరుప్పుల మండల పరిధిలోని ప్రతి గ్రామంలో రైతులు, కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ మిగిలిపోకుండా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక పథకం కాదు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న భద్రత అని అన్నారు.
నమోదు కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ వెంట తీసుకురావాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నిర్ణయించుకుని సమీప గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా మండల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఫారంలో పేరు, బ్యాంకు వివరాలు, నామినీ వివరాలు తప్పులు లేకుండా జాగ్రత్తగా రాయించుకోవాలని సూచించారు. చిన్న పొరపాటు వల్ల తర్వాత ఇబ్బంది రాకూడదన్నారు.
ప్రభుత్వం ఇస్తున్న ఈ రక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకుని తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించుకోవాలని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

