మెహందీ, రంగవల్లుల పోటీలతో కళకళలాడిన గ్రంథాలయ వారోత్సవాలు
విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలి – జీడీఓ కవిత
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 19:
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా గురువారం ఆరో రోజు కళాశాల, పాఠశాల విద్యార్థినులకు మెహందీ, రంగోలి (ముగ్గుల) పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కవిత విద్యార్థినులు రూపొందించిన మెహందీ డిజైన్లు, రంగురంగుల ముగ్గులను ఆసక్తిగా తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా గ్రంథాలయాలకు వెళ్లి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం. కనకలక్ష్మి మాట్లాడుతూ ప్రతి అమ్మాయి ఉన్నత విద్యను అభ్యసించి స్వయంకృషితో జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు వివిధ సాంస్కృతిక, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ గఫార్ ఆధ్వర్యంలో, పెద్దపల్లి సీఆర్‌పీ బాలసాని వెంకటేష్, సుందరగిరి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథపాలకులు యూనుస్ ఖాద్రి, గ్రంథపాలకురాలు బి. కవిత, భారతి, గ్రంథాలయ సిబ్బంది సీహెచ్. స్వరూప, షేర్ ఖాన్, జి. సదానందం, సంపత్ కుమార్, వివిధ కళాశాలలు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పాఠకులు, పాఠకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

