📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణముగ్గురు అమరుల త్యాగం.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దొడ్డి కుటుంబం

ముగ్గురు అమరుల త్యాగం.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దొడ్డి కుటుంబం

📰 Generate e-Paper Clip

ముగ్గురు అమరుల త్యాగం.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దొడ్డి కుటుంబం

ప్రజావాణి నవంబర్ 19

తెలంగాణ సాయుధ పోరాటంలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రాణత్యాగం.. నేడు కనీస అవసరాలకూ ఇబ్బందులు పడుతున్న వారసులు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో దొడ్డి కొమురయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది భూస్వామ్య, రజాకారుల అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 1946 జూలై 4న ప్రాణత్యాగం చేసిన కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆయన త్యాగం వెనుక ఒక కుటుంబం చేసిన పోరాటం ఆ కుటుంబం ఎదుర్కొన్న త్యాగాలు, నేటి వారసుల దీనస్థితి మాత్రం అంతగా వెలుగులోకి రావడం లేదు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అమరులు

దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమురయ్య అన్నదమ్ములు కాగా మల్లయ్య పెద్ద కుమారుడు దొడ్డి ఆగయ్య కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. 1946 జూలై 4న కడవెండిలో జరిగిన కాల్పుల్లో మల్లయ్య కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి అదే ఘటనలో ఆయన తమ్ముడు 19 ఏళ్ల కొమురయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు కొమురయ్య మరణం తెలంగాణ రైతాంగ పోరాటంలో కీలక మలుపుగా నిలిచింది గాయాల కారణంగా మల్లయ్య కూడా ఏళ్ల తరబడి అనారోగ్యంతో బాధపడ్డారు. సరైన వైద్యం అందక 1981లో కన్నుమూశారు

ఇక 1947లో మల్లయ్య పెద్ద కుమారుడు దొడ్డి ఆగయ్యను దుండగులు చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్లు కుటుంబ చరిత్ర చెబుతోంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన కొమురయ్య, మల్లయ్య, ఆగయ్యలు పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ చరిత్రలో ఈ కుటుంబం చేసిన త్యాగం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

త్యాగాల కుటుంబానికి తప్పని ఆర్థిక కష్టాలు

తెలంగాణ కోసం కుటుంబ సభ్యుల ప్రాణాలనే త్యాగం చేసిన దొడ్డి కుటుంబ వారసులు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొడ్డి మల్లయ్య కుమారుడు దొడ్డి భిక్షపతి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది చెట్టుపై నుంచి పడటంతో నడుముకు గాయమై మంచానికే పరిమితమైన భిక్షపతి రోజువారీ అవసరాల కోసం ఇతరుల సహాయంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య అనసూయ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తరచూ ఫిట్స్ రావడంతో కుటుంబానికి ఇబ్బందులు మరింత పెరిగాయి

కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యల కారణంగా భిక్షపతి పెద్ద కుమారుడు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు దొడ్డి కొమురయ్య మనవడు దొడ్డి చంద్రం హైదరాబాద్‌లో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు

స్మరించుకోవడమేనా వారసులను ఆదుకోవడం లేదా

దొడ్డి కొమురయ్య జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. వరంగల్ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబం వారసులు నేడు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. చరిత్రలో అమరులుగా నిలిచిన వారి కుటుంబ సభ్యులు కనీస అవసరాల కోసం ఇబ్బందులు పడుతుండటం ఆవేదన కలిగిస్తోంది.

ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

దొడ్డి కుటుంబ వారసుల ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న భిక్షపతి అనసూయలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు కుటుంబానికి ఆర్థిక సహాయం, జీవన భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు

తెలంగాణ చరిత్రలో దొడ్డి కొమురయ్య పేరు చిరస్థాయిగా నిలవడం గర్వకారణమే. అయితే ఆయనతో పాటు కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను గుర్తించి, నేడు కష్టాల్లో ఉన్న వారి వారసులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా సమాజం, ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అమరులు ఒకరు తొలి అమరుడిగా చరిత్రలో నిలిచారు.. మరొకరు బుల్లెట్ గాయాలతో కన్నుమూశారు.. ఇంకొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి త్యాగం చేసిన కుటుంబ వారసులు నేడు పేదరికంతో పోరాడుతున్నారు. అమరుల చరిత్రను స్మరించుకోవడంతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి కూడా చర్యలు తీసుకోవాలన్నదే స్థానికుల విజ్ఞప్తి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.