*తానూరు అభివృద్ధికి సహకరించండి.. విట్టల్ రెడ్డికి నాయకుల వినతి*
*ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో తానూరు నవంబర్ 19:- తానూరు మండల కేంద్రంలో నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తానూరు మండల కేంద్రంలో అర్హులైన నిరుపేదలకు నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని, సొంతంగా ఇళ్ల స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ సహకారంతో ఇంటి స్థలాలు లేదా ఫ్లాట్లు మంజూరయ్యేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇప్పటికే నూతన పెన్షన్లు మంజూరు చేసిన నేపథ్యంలో, ఇంకా అర్హత కలిగి పెన్షన్లు పొందని పేదలకు కూడా కొత్త పెన్షన్లు మంజూరయ్యేలా కృషి చేయాలని విట్టల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా సహకరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తానూరు మండల సీనియర్ నాయకులు దారుమూడు సుభాష్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ పోత రెడ్డి, దంతులవారి సాయినాథ్, పండరి, మల్లేష్, భూమన్న, గణేష్, ముత్తన్న, లక్ష్మణ్ బాబు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

