విద్యార్థుల్లో సృజనాత్మకతకు పాటల పోటీలు దోహదం
గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని పఠన అలవాటు పెంపొందించుకోవాలి
జిల్లా విద్యాశాఖ అధికారి గద్వాల శారద
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 18:
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు దేశభక్తి, జానపద గీతాల పోటీలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి గద్వాల శారద మాట్లాడుతూ గ్రంథాలయం దేవాలయంతో సమానమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయాన్ని గ్రంథాలయంలో గడుపుతూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరగడంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవాలని సూచించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్చార్జి కార్యదర్శి ఎం. కనకలక్ష్మి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలకు చెందిన 30 వేలకుపైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ పుస్తకాలను చదవడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ గఫార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను పెద్దపల్లి సీఆర్పీ బాలసాని వెంకటేష్, సుందరగిరి శ్రీనివాస్ పర్యవేక్షించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి, జానపద గీతాలను ఆలపించి తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు యూనుస్ ఖాద్రి, గ్రంథాలయ పాలకురాలు బి. కవిత, ఎం. భారతి, గ్రంథాలయ సిబ్బంది ఛి. స్వరూప, జి. సదానందం, పాఠకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

