అన్ని వార్డుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతాం
మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య
12, 13వ వార్డుల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పర్యటన
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి:నవంబర్ 18
పెద్దపల్లి పట్టణంలోని 36 వార్డుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి, అన్ని వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య తెలిపారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం పట్టణంలోని 12, 13వ వార్డుల్లో ఆయన స్థానిక కౌన్సిలర్లు దొడ్డుపల్లి జగదీష్, పాగల శ్రీకాంత్‌లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల పరిస్థితి, ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలను పరిశీలించారు.
అనంతరం చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అవసరమైన ప్రాంతాల్లో సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడతామని, అవసరమైన చోట అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ఖాళీ స్థలాల యజమానులు తమ ప్లాట్లలో చెట్లు, పిచ్చిమొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. మురుగు కాలువల్లో, రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది విజిల్ వేస్తూ చెత్త సేకరణకు వచ్చినప్పుడు ప్రజలు తమ ఇంటి వద్ద సేకరించిన చెత్తను వారికి అందజేయాలని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పారిశుధ్య నిర్వహణలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా వార్డుల్లో గుర్తించిన అభివృద్ధి పనులను సైతం త్వరలోనే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చైర్మన్ కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ఆరెపల్లి సురేందర్, వార్డు ఆఫీసర్లు సాగర్, స్వరూప, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పులిపాక రాజు, ఎలక్ట్రీషియన్లు సత్యం, శ్రీకాంత్, వాటర్ సప్లై లైన్‌మెన్లు ప్రశాంత్, ఆనంద్, ఆయా వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

