📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయి

విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయి

📰 Generate e-Paper Clip

విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజావాణి న్యూస్ నవంబర్ 11, 2026:

విద్యతోనే వ్యక్తి జీవితంలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతో తమ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని లక్షెట్టిపేటలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల వార్షిక క్రీడా దినోత్సవ కార్యక్రమానికి ఆర్.సి.ఓ. శ్రీధర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల ప్రధానమంత్రి శ్రీ మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్యా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ప్రభుత్వ, గురుకుల పాఠశాలలలో మెరుగైన వసతుల కల్పనకు, విద్యా ప్రమాణాల పెంపుదల, విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాథమిక ఇస్తుందని తెలిపారు. జిల్లాలో 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, ఒక్కో పాఠశాలను సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతుందని, ఈ పాఠశాలలలో ఒక్కొక్కటిలో సుమారు 2 వేల 600 మంది చొప్పున మొత్తం 7 వేల 800 మంది విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాలలో, అద్దె భవనాలలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చి, విద్యార్థులకు మెరుగైన తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులు తమ జీవితంలో విద్య ప్రాధాన్యతను గుర్తించాలని, ఆర్థికంగా ఎదగడానికి మూలధనం, భూమి వంటి ఆస్తులు ఒక మార్గమైతే, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యే అత్యంత శక్తివంతమైన సాధనమని తెలిపారు. విద్య ద్వారా అపారమైన జ్ఞానం, ఆత్మవిశ్వాసం, అవకాశాలు లభిస్తాయని, పుట్టుకతోనే అన్ని సౌకర్యాలు కలిగిన వారితో సైతం పోటీపడి విజయం సాధించే శక్తిని విద్య అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు తమకు లభిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుపై పూర్తి దృష్టి సారించాలని, విద్య మాత్రమే తమ జీవితాలను మార్చగలదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, జట్టుస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, భవిష్యత్తులో ఎదురయ్యే వివిధ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దోహదపడతాయని తెలిపారు. క్రీడా పోటీలలో పాల్గొనే విద్యార్థులు కేవలం పాల్గొనడానికే పరిమితం కాకుండా, సాధనలో నిబద్ధత, క్రమశిక్షణ, పరస్పర సమన్వయం ప్రదర్శించాలని సూచించారు. మార్చ్‌ఫాస్ట్‌లో కూడా ప్రతి విద్యార్థి ఒకే విధమైన అడుగులు వేస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ఏదైనా పనిని శ్రద్ధగా, బాధ్యతగా నిర్వహిస్తున్నారనే అంశం వారి వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని తెలియజేస్తుందని వివరించారు. ఉద్యోగ ఎంపికలు, పోటీ పరీక్షలు, ప్రైవేటు రంగాలలో అవకాశాలు పొందడంలో వ్యక్తుల క్రమశిక్షణ, చురుకుదనం, సమన్వయం, నేర్చుకోవాలనే ఆసక్తి, అంకితభావం కీలకమని తెలిపారు. విద్యార్థులు ఏ పని చేపట్టినా పూర్తి నిబద్ధతతో, కష్టపడి పనిచేస్తూ నిరంతరం సాధన చేసినట్లయితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు.

అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి డిప్యూటీ తహసిల్దార్ శ్రావణి తో కలిసి జి.ఓ. నంబర్ 76, 58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులు, భూ భారతి కార్యక్రమం, భూముల రీ-సర్వే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. జి.ఓ. నం. 58, 59 లకు సంబంధించిన దరఖాస్తుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు. రీ-సర్వేకు సంబంధించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు మంజూరు చేసేందుకు అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.