📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు చిరస్మరణీయం –...

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు చిరస్మరణీయం – ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల: నవంబర్ 11ప్రజావాణి భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగం మరియు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ మాట్లాడుతూ,భారతదేశ విద్యా వ్యవస్థ అభివృద్ధికి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, దేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేశారని తెలిపారు.విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అనే భావనతో సమాజంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.దేశ భవిష్యత్తు విద్యావంతులైన యువత చేతుల్లోనే ఉంటుందని విశ్వసించిన ఆజాద్,ఉన్నత విద్య, సాంకేతిక విద్య, పరిశోధన రంగాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.దేశంలో ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటుకు,విశ్వవిద్యాలయాల అభివృద్ధికి,యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటుకు సంబంధించిన విద్యా విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని వివరించారు.నేటి భారతదేశంలో విద్యా రంగం సాధిస్తున్న ప్రగతికి ఆయన వేసిన పునాదులు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు.విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి,సామాజిక చైతన్యానికి, దేశాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రమశిక్షణ, మానవతా విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు.మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని విద్యా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రకాశ్ రావు మాట్లాడుతూ,మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ విద్యారంగానికే కాకుండా సాహిత్యం,కళలు, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి కూడా విశేష కృషి చేశారని తెలిపారు.దేశంలో సాహిత్య అకాడమీ,సంగీత నాటక అకాడమీ,లలిత కళా అకాడమీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల స్థాపనకు ఆయన ప్రోత్సాహం అందించారని గుర్తుచేశారు. విద్యతో పాటు భారతీయ కళలు,సాహిత్యం,సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనే ఆలోచనను ఆయన బలంగా సమర్థించారని,పేద,బడుగు,బలహీన వర్గాల పిల్లలకు విద్య అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారని తెలిపారు.విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని, అజ్ఞానం, పేదరికం,సామాజిక అసమానతలను తొలగించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.విద్యార్థులు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జీవిత చరిత్రను, ఆయన దేశానికి చేసిన సేవలను తెలుసుకోవడంతో పాటు ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని అధ్యాపకులు సూచించారు.విద్యను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని,దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో విద్య ప్రాముఖ్యత,జాతీయ భావన,సామాజిక బాధ్యత పట్ల అవగాహన పెంపొందించడానికి దోహదపడింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ సులోచన,డాక్టర్ చెన్నారెడ్డి,చెన్నరాయుడు, నరసింహారెడ్డి,వెంకట ప్రియ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.