విద్యార్థుల వివరాలనుఎఫ్ ఆర్ ఎస్ పోర్టల్ లో నమోదు చేయడంలో జాప్యం ఉండకూడదు.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో.
ఏటూరునాగారం నవంబర్ 03 ప్రజావాణి:
తాడ్వాయి బాలికల ఆశ్రమ పాఠశాలలో తనిఖీ.. పోర్టల్ నమోదుల పురోగతిని పరిశీలించి, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం.
గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ పోర్టల్స్‌లో సక్రమంగా నమోదు చేయడంతో పాటు, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులకు సూచించారు.
ఈ మేరకు పీఓ తాడ్వాయి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు సంబంధించిన వివరాలు పోర్టల్స్‌లో నమోదు చేశారా లేదా అనే అంశంపై తనిఖీ నిర్వహించారు. పోర్టల్స్‌లో నమోదు చేసిన వివరాలను పరిశీలించి, ఇంకా నమోదు చేయాల్సినవి, పెండింగ్‌లో ఉన్న అంశాలపై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలను నిర్దేశిత పోర్టల్స్‌లో ఖచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నమోదులను వెంటనే పూర్తి చేయాలని, ఎలాంటి తప్పులు లేకుండా వివరాలను మరోసారి సరిచూసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు అర్హులైన ప్రతి విద్యార్థికి అందేలా రికార్డులు, ఆన్‌లైన్ నమోదులు సమగ్రంగా ఉండాలని తెలిపారు. సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

