📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిదేశీ పౌరులకు వసతి కల్పించే ప్రతి ఒక్కరూ ఫార్మ్-III ఆన్‌లైన్ నమోదు తప్పనిసరిగా చేయాలి

విదేశీ పౌరులకు వసతి కల్పించే ప్రతి ఒక్కరూ ఫార్మ్-III ఆన్‌లైన్ నమోదు తప్పనిసరిగా చేయాలి

📰 Generate e-Paper Clip

*విదేశీ పౌరులకు వసతి కల్పించే ప్రతి ఒక్కరూ ఫార్మ్-III ఆన్‌లైన్ నమోదు తప్పనిసరిగా చేయాలి* ..

*ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

భారతదేశానికి వచ్చే విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, పీజీ వసతులు, హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోమ్‌స్టేలు, ప్రైవేట్ ఇళ్ల యజమానులు తదితరులు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సూచించారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, హైదరాబాద్ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) జారీ చేసిన పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం విదేశీ పౌరుల రాకపోకలకు సంబంధించిన వివరాలను నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వసతి కల్పించే వారి చట్టబద్ధమైన బాధ్యత అని తెలిపారు. ఫార్మ్ – III నమోదు తప్పనిసరి
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025 లోని సెక్షన్ 8 ప్రకారం విదేశీ పౌరులకు వసతి కల్పించే వ్యక్తులు, సంస్థలు వారి రాక, నిష్క్రమణ వివరాలను ఫార్మ్-III (గతంలో ఫార్మ్-C) ద్వారా ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఈ నిబంధనలు OCI కార్డు కలిగిన విదేశీ పౌరులు, నేపాల్, భూటాన్ పౌరులతో సహా వర్తించే విదేశీ పౌరుల విషయంలో పాటించాల్సి ఉంటుందని సూచించారు. విదేశీ అతిథి వచ్చిన 24 గంటల్లోగా సంబంధిత వివరాలను నమోదు చేయాలని, నమోదు చేసిన రికార్డులను ఒక సంవత్సరం పాటు భద్రపరచాలని తెలిపారు. హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, Airbnb వసతులు, పీజీలు, హాస్టళ్లు మాత్రమే కాకుండా విదేశీ అతిథులకు వసతి కల్పించే ప్రైవేట్ ఇళ్ల యజమానులు, హోమ్‌స్టే నిర్వాహకులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఇతర వసతి ప్రదాతలు కూడా తమకు వర్తించే నిబంధనలను తెలుసుకుని అమలు చేయాలని ఎస్పీ సూచించారు.

*ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి*

విదేశీ పౌరులకు వసతి కల్పించే వారు అధికారిక వెబ్‌సైట్ https://indianfrro.gov.in ద్వారా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. ముందుగా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, అవసరమైన వివరాలు సమర్పించి, సంబంధిత కార్యాలయం నుంచి లాగిన్ వివరాలు పొందిన అనంతరం విదేశీ అతిథుల వివరాలను నిర్ణీత గడువులోగా నమోదు చేయాలి. వసతి ప్రదాతలు తమకు వర్తించే మాడ్యూల్, అవసరమైన పత్రాలు, సమర్పణ విధానం గురించి అధికారిక పోర్టల్‌లోని సూచనలను అనుసరించాలని తెలిపారు.

*నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు*

విదేశీ పౌరుల వివరాలను నిర్ణీత సమయంలో నమోదు చేయకపోవడం, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా విదేశీయులకు వసతి కల్పించడం, నకిలీ ప్రయాణ పత్రాలను ఉపయోగించడం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా దేశంలో ఉండటం వంటి ఉల్లంఘనలకు సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం జరిమానాలు, క్రిమినల్ ప్రాసిక్యూషన్ లేదా ఇతర చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు కూడా తమకు వర్తించే ప్రత్యేక రిపోర్టింగ్ నిబంధనలను పాటించాలని సూచించారు.

*విదేశీ పౌరులు కూడా నిబంధనలు పాటించాలి*
భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా కలిగి ఉండాలని, వీసా నిబంధనలకు అనుగుణంగా తమ నివాసాన్ని కొనసాగించాలని సూచించారు. నివాస చిరునామా మారినప్పుడు వర్తించే విధంగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, పాస్‌పోర్ట్ లేదా వీసా పోగొట్టుకున్న సందర్భంలో వెంటనే స్థానిక పోలీసులకు, FRRO అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. విద్యార్థులు తమ వీసా నిబంధనలను పాటించడంతో పాటు విద్యాసంస్థ లేదా కోర్సు మార్పులకు సంబంధించిన వివరాలను అవసరమైన విధంగా అప్‌డేట్ చేయాలి. తప్పుడు పత్రాలను సమర్పించడం, వీసా గడువు దాటిన తర్వాత దేశంలో కొనసాగడం, అనుమతి లేని కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

విదేశీ పౌరులకు వసతి కల్పించే యజమానులు, నిర్వాహకులు ఈ నిబంధనలపై అవగాహన పెంచుకుని సకాలంలో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ కోరారు. చట్ట నిబంధనలను పాటించడం ద్వారా అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.