*ముధోల్ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి*
*మిగిలిన మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి.. భూముల రిజిస్ట్రేషన్ నిషేధం ఎత్తివేయాలి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరిన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 02:–
ముధోల్ నియోజకవర్గంలోని పేద, నిరుపేద కుటుంబాలకు అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, నియోజకవర్గంలోని మిగిలిన మండలాలను కూడా కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంత్రిని కలిసి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినందుకు ప్రజల తరఫున మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా మిగిలిన బాసర, తానూర్, ముధోల్, లోకేశ్వరం, నర్సాపూర్ (జి) మండలాలను కూడా కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించి ఆయా ప్రాంతాల రైతులకు ప్రభుత్వ పరంగా పంట నష్టపరిహారం, ఇతర సహాయక చర్యలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే తానూర్ మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు ఇతర మండలాల్లోనూ భూముల క్రయవిక్రయాలకు సంబంధించి నెలకొన్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంజాబ్‌కు చెందిన వ్యక్తులు కొన్ని భూములను కొనుగోలు చేసిన సందర్భాల్లో ఒక ఎకరం కొనుగోలు చేసినప్పటికీ, అదే సర్వే నంబర్‌లో మిగిలిన ఎకరాల భూముల బదలాయింపుపై కూడా నిషేధం విధించడంతో రైతులు, భూముల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ నిషేధాన్ని తొలగించి భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరారు.
కొద్ది రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరైన సందర్భంగా ఈ సమస్యను ప్రస్తావించినట్లు తెలిపారు. అప్పట్లో మంత్రుల సూచన మేరకు జిల్లా కలెక్టర్‌కు గ్రామసభలు నిర్వహించి సమస్యను పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. వారి ఆదేశాల మేరకు ప్రస్తుతం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ సమస్యపై అధికారులు త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టి, భూముల యజమానులకు ఇబ్బందులు లేకుండా నిషేధం తొలగింపునకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి కోరారు.

