📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రభుత్వం నిర్ణయించిన "ధరలకే " బియ్యం విక్రయించాలి...!

ప్రభుత్వం నిర్ణయించిన “ధరలకే ” బియ్యం విక్రయించాలి…!

📰 Generate e-Paper Clip

ప్రభుత్వం నిర్ణయించిన “ధరలకే ” బియ్యం విక్రయించాలి…!

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, బియ్యం కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు.

బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాస రెడ్డితో కలిసి జిల్లాలో బియ్యం ధరల నియంత్రణ, సరఫరా వ్యవస్థ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, లీగల్ మెట్రోలజి, మిల్లర్లు, హోల్ సేల్, రిటైల్ విక్రయదారులతో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ బియ్యం నిత్యావసర వస్తువని, ప్రజలకు నిర్ణీత ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలో బియ్యం విక్రయించే ప్రతి దుకాణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను స్పష్టంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి ఏ పరిస్థితుల్లోనూ బియ్యం విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ. 66, ఆర్ఎన్ఆర్., తెలంగాణ సోనా రకం బియ్యం కిలో రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్ఆర్ రకం బియ్యం కిలో రూ. 79గా రిటైల్ విక్రయ ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ధరలను ప్రతి రిటైల్ వ్యాపారి తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

బియ్యం మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలపై స్పష్టమైన సమాచారం అందించాలని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో బియ్యం నిల్వలు, సరఫరా, విక్రయాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. బియ్యం కృత్రిమ కొరత సృష్టించడం, నిల్వలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని వ్యాపారులకు సూచించారు. వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలను ఉల్లంఘించి బియ్యం విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వలు దాచిపెట్టినా వెంటనే సరుకును స్వాధీనం చేసుకొని వేలం వేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లాలో బియ్యం ధరల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మిల్లర్ల నుంచి రిటైల్ వ్యాపారుల వరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలయ్యేలా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, డి ఎం సివిల్ సప్లయ్ మల్లికార్జున బాబు, లీగల్ మెట్రోలాజి అధికారి, సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లు, హోల్ సేల్, రిటైల్ విక్రయదారులు, శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.