గురుకుల చిన్నారుల మధ్య సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపిన జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 09 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జనగామ పట్టణంలోని అతిథి గురుకుల పాఠశాలలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి – శ్రీనివాస్ హాజరయ్యారు.
గురుకుల పాఠశాలకు చేరుకున్న ఛైర్పర్సన్ కి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం చిన్నారుల సమక్షంలో, వారితో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఛైర్పర్సన్, చిన్నారులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఛైర్పర్సన్ బాలమణి – శ్రీనివాస్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, పేదల సంక్షేమానికి, విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఆయన నాయకత్వంలో జనగామ పట్టణంతో పాటు రాష్ట్రం మొత్తం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని తెలిపారు.
అనంతరం ఛైర్పర్సన్ చిన్నారులతో కొంత సమయం సరదాగా గడిపారు. ఒక్కొక్కరి యోగక్షేమాలను, చదువు విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా చిన్నారులకు టపాకాయలు అందజేసి వారితో పాటు టపాకాయలు పేల్చి వారి ఆనందంలో పాలుపంచుకున్నారు.
విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి, క్రమశిక్షణతో, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తల్లిదండ్రులకు, గురువులకు, జనగామ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని చిన్నారులను ప్రోత్సహించారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి వసతులు అందించేందుకు మున్సిపాలిటీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


