*ఈనెల 15 న ఎన్జీ కాలేజీలో రైతుల భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి*
*రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వేలాదిగా తరలిరావాలి: సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి*
*నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
అఖిల భారత రైతు సంఘం 36 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కనగల్ మండలంలో జీ. యడవల్లి గ్రామంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు రైతులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, నవంబర్ 15 వ తేదీన నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో నిర్వహించే రైతుల భారీ బహిరంగ సభకు జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న శ్రీశైలంసొరంగ మార్గం, చర్లగూడెం రిజర్వాయర్లు వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేసి, వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, రైతుల హక్కుల సాధన కోసం జరిగే పోరాటాల్లో రైతులు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించి, పరిష్కారాల సాధనకు కృషి చేసే అఖిల భారత రైతు సంఘం 36 వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్ల మహేష్, మండల నాయకులు ఎం.డి. సుల్తానా, శంకర్, రాములమ్మ, మల్లేష్, లింగయ్య, నరసింహ, సైదులు తదితరులు పాల్గొన్నారు.

