ఐక్యమత్యంతోనే దేశాభివృద్ధి
జాతీయ ఐక్యతా దినోత్సవంలో తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ
మన ప్రజావాణి
మందమర్రి
దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలందరిలో ఐక్యమత్య భావన బలపడాలని మందమర్రి తహసీల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం మందమర్రి మండల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో కలిసి ఆయన జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారతదేశ ఐక్యతకు పటిష్టమైన పునాదులు వేసిన మహనీయుడు పటేల్ అని కొనియాడారు. ఆయన దూరదృష్టి, కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాల స్థాయిలో ఐక్యతా భావాన్ని పెంపొందించుకోవాలని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటంతో పాటు ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అంజన్ కుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు..

