ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం:- (ప్రజావాణి) ఇంచార్జ్ మదుసుదన్
పెద్ద శంకరంపేట:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
గ్రామానికి చెందిన దంతెల రాధిక, భర్త భాస్కర్ కుటుంబం నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహంలో దీపాలు వెలిగించి, వారితో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని అన్నారు. అర్హులైన పేదలకు సొంత ఇళ్లు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమయంలో లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాల్లో దీపాలు వెలిగించి, వారితో కలిసి పండుగ జరుపుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆసురి మురళి పంతులు, నారా గౌడ్, రాయిని మధు, పెరుమాళ్ గౌడ్, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

