సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష
• రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా సంఘీభావ దీక్ష
మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 08 సంగారెడ్డి: జిల్లా ప్రతినిధి
దేశ ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంఘీభావ దీక్ష చేపట్టారు. రాత్రి 10 గంటల నుంచి దీక్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “దేశ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయ పోరాటం కాదు.. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటం” అని అన్నారు.
ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. SIR ప్రక్రియ, ఓటర్ల జాబితాలకుi సంబంధించిన అంశాలపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.
“రాహుల్ గాంధీ పోరాటం కొనసాగినంత కాలం సంగారెడ్డిలో మా దీక్ష కూడా కొనసాగుతుంది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా మా పోరాటం కొనసాగిస్తాం” అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. దేశ ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజలంతా ప్రజాస్వామ్యబద్ధంగా తమ మద్దతును తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ దీక్షలో నిర్మల జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

