📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

📰 Generate e-Paper Clip

వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

– స్వేచ్ఛా రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
– వెట్టిచాకిరీ ఘటనల సమాచారానికి టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 080-69434343

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, అక్టోబర్ 13:

వెట్టిచాకిరీ నిర్మూలన, నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. వెట్టిచాకిరీ రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన స్వేచ్ఛా రథాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వెట్టిచాకిరీ నిర్మూలనకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ నిర్మూలన, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బాధితులకు సకాలంలో ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎక్కడైనా వెట్టిచాకిరీ ఘటనలు జరిగినట్లు గుర్తించినా, అలాంటి ఘటనల గురించి తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్

వెట్టిచాకిరీ ఘటనల సమాచారాన్ని అందించేందుకు, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకునేందుకు టోల్‌ఫ్రీ బాండెడ్ లేబర్ హెల్ప్‌లైన్ 080-69434343 అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. వెట్టిచాకిరీ బాధితులు, ఈ తరహా ఘటనల గురించి తెలిసిన వారు హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని సూచించారు.

స్వేచ్ఛా రథం ద్వారా వెట్టిచాకిరీ వల్ల కలిగే అనర్థాలు, దాని నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై వెట్టిచాకిరీ నిర్మూలనకు సహకరించాలని కోరారు.

గౌరవప్రదమైన జీవనం ప్రతి ఒక్కరి హక్కు

ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా, స్వేచ్ఛగా, ఎలాంటి దోపిడీకి గురికాకుండా పనిచేసే పరిస్థితులను కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. వెట్టిచాకిరీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బాధితులకు అండగా నిలిచి వెట్టిచాకిరీ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.