*రాజకీయంగా కక్ష తోనే తనపై మంత్రి వివేక్ వేధింపులు*
*బిఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్*
* *మన ప్రజావాణి* మందమర్రి:-
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనపై రాజకీయంగా కక్ష కట్టి, బ్లాక్ మెయిల్, నిరంకుశ రాజకీయాలకు పాల్పడుతున్నారని పట్టణానికి బిఆర్ఎస్ నాయకుడు మద్ది శంకర్ ఆరోపించారు. ఆయన నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్ ను సింగరేణి యాజమాన్యం స్వాధీనం చేసుకోవడంతో గురువారం ఆయన, తన భార్యతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మద్ది శంకర్ మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, మంత్రి వివేక్ తండ్రి కాకా వెంకటస్వామి కుటుంబానికి 35 ఏళ్లు విధేయుడిగా పనిచేశానని తెలిపారు. 2022లో వివేక్ తో విభేదించి, బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి వచ్చానని, అప్పటి నుండి వివేక్ తనపై కుట్రతో, ఆయన ఎమ్మెల్యేగా, ఆయన కొడుకు ఎంపీగా గెలిచిన అనంతరం తాను ఉంటున్న సింగరేణి క్వార్టర్ బి-40 కి విద్యుత్, నీటి కనెక్షన్ తొలగించి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. సెప్టెంబర్ 8న తాను హైదరాబాద్ లో ఉండగా, సింగరేణి అధికారులు తాను నివాసం ఉంటున్న బి 40 క్వార్టర్ తాళాలు పగలగొట్టి, సామాన్లు తీసుకెళ్లి, క్వార్టర్ ను సీజ్ చేశారని తెలిపారు. 20 రోజులు మంత్రి వివేక్ ఇంటికి వెళ్లి బ్రతిమిలాడినా కనికరం లేకుండా అవమానించి, పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సైతం సింగరేణి అధికారులు తాను నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్ బి 40 లో మిగిలిన సామాను సైతం బలవంతంగా తీసుకెళ్లారు. గత నెల రోజులుగా నిలువ నీడ లేకుండా కుటుంబంతో కట్టుబట్టలపై తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా దీక్ష చేస్తున్నానని తెలిపారు. తన మద్దతు తెలిపిన బిఆర్ఎస్, బిఎస్పీ, జనసేన పార్టీ నేతలకు, దళిత సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తన ఒక్కడి సమస్య కాదని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సమస్య అని తెలిపారు. ఇప్పటికైనా మంత్రి వివేక్ బ్లాక్ మెయిల్, నిరంకుశ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.
*సింగరేణి నిబంధనల ప్రకారమే చర్యలు*
*ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ*

సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్ ను అనధికారికంగా ఆక్రమించి, నివాసముంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ విచారణ నిర్వహించి,సంస్థ నిబంధనల ప్రకారమే బి 40 క్వార్టర్ ను ఖాళీ చేయించామని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ, సింగరేణికి చెందిన బి-40 క్వార్టర్ లో మద్ది శంకర్ అనే వ్యక్తి అనధికారికంగా నివాసముంటున్నట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారణ అయిందని, గతంలో అందిన ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, నివేదిక సమర్పించారని తెలిపారు. క్వార్టర్ ఖాళీ చేయాలని మద్ది శంకర్ కు పలుమార్లు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగిందని, అయినప్పటికీ ఆయన ఖాళీ చేయక పోవడంతో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మూడు పర్యాయాలు రాతపూర్వక నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం ఎవిక్షన్ ప్రక్రియలో భాగంగా ఫారం-ఏ, ఫారం-బి నోటీసులు అందించినప్పటికీ క్వార్టర్ ఖాళీ చేయకపోవడంతో,నిబంధనల ప్రకారం పోలీసుల సమక్షంలో ఎస్టేట్,సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో క్వార్టర్ ను ఖాళీ చేయించినట్లు వివరించారు. క్వార్టర్ లో ఉన్న సామాగ్రిని భద్రంగా తరలించి, భద్రపరిచామని ఆయన వచ్చి తన వస్తువులను తీసుకెళ్లవచ్చునని తెలిపారు. హైదరాబాద్ లోని హైడ్రా తరహాలో సింగరేణి సంస్థ ఆస్తులను పరిరక్షించడంలో భాగంగానే నిబంధనల ప్రకారం, చట్టరీత్య చర్యలు తీసుకున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. క్వార్టర్ ఖాళీ చేయింపు వ్యవహారంతో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం కోసం గతంలో సింగరేణి నిబంధనల ప్రకారం బి-1 క్వార్టర్ ను అధికారికంగా కేటాయించామని, సంస్థ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే క్వార్టర్ కేటాయింపు ఉంటుందని తెలిపారు. బి-40 క్వార్టర్ ను ఎవరికీ అధికారికంగా కేటాయించలేదని స్పష్టం చేశారు..

