మోడల్ మార్కెట్ లో షాపుల కేటాయింపు కు వీధి వ్యాపారుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం
మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): జనగామ పట్టణాన్ని శుభ్రంగా, సుందరంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేని పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జనగామ మున్సిపాలిటీ కీలక చర్యలు చేపడుతోందని మున్సిపాలిటీ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వీధి వ్యాపారాలను సంజయ్‌నగర్‌లో నిర్మించిన ఆధునిక మోడల్ మార్కెట్‌కు దశలవారీగా తరలించేందుకు మున్సిపాలిటీ చర్యలు ప్రారంభించిందన్నారు.
సుమారు ₹7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మార్కెట్‌లో వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయన్నారు.
– కూరగాయల మార్కెట్ – 50 షాపులు
– నాన్-వెజ్ మార్కెట్ – 65 షాపులు
– తాగునీటి, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలు
– ప్రజలకు సౌకర్యవంతమైన మార్కెట్ వాతావరణం
– క్రమబద్ధంగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉందన్నారు.
సంజయ్‌నగర్ మోడల్ మార్కెట్‌లో షాపుల కేటాయింపునకు అర్హత కలిగిన వీధి వ్యాపారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
దరఖాస్తు తేదీలు: 07-10-2026 నుండి 10-10-2026 వరకు
అర్హత కలిగిన వీధి వ్యాపారులు నిర్ణీత గడువులోపు మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రోడ్లపై వ్యాపారాల వల్ల ట్రాఫిక్, పారిశుధ్య సమస్యలు, ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతోందని, వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యామ్నాయ స్థలాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
“వ్యాపారుల జీవనోపాధికి రక్షణ – ప్రజలకు మెరుగైన రాకపోకలు – జనగామకు సుందర రూపం” అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, వీధి వ్యాపారులు సహకరించాలని కోరారు.

