మూసాపేట్లో విద్యార్థినులకు పోక్సో చట్టంపై అవగాహన
బాలల రక్షణ, వ్యక్తిగత భద్రతపై విద్యార్థినులకు న్యాయ అవగాహన
మూసాపేట్ : అక్టోబర్ 27 ( ప్రజావాణి)
మూసాపేట్: పిల్లలపై లైంగిక నేరాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా మూసాపేట్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ గౌరవ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆదేశాల మేరకు, కూకట్పల్లి మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్, III అదనపు జిల్లా జడ్జి శ్రీ ఎం. వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినులకు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే పోక్సో (POCSO) చట్టం–2012 గురించి వివరించారు. బాలల భద్రత, వ్యక్తిగత రక్షణ, మంచి స్పర్శ–చెడు స్పర్శపై అవగాహన, అనుమానాస్పద పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండటం, సమస్యలు ఎదురైనప్పుడు నమ్మకమైన పెద్దలకు తెలియజేయడం వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
పిల్లలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడంలో చట్టాలపై అవగాహన ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థిని తన హక్కులు తెలుసుకొని భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా వివరించారు. బాలలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజం సమష్టిగా బాధ్యత వహించాలని సూచించారు.
