మన్ సాన్ పల్లి శివారులో అనుమతులు లేని నిర్మాణాల కలకలం.
సర్వే నంబర్ 189లో ఫామ్‌హౌస్ నిర్మాణాలపై ప్రశ్నలు.. నోటీసులకే పరిమితమైన అధికారులు.
నాలా కన్వర్షన్ లేకుండానే వ్యాపార కార్యకలాపాలా? ఎకరం భూమిలో భారీ భవనాలకు పిల్లర్ల నిర్మాణం!
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు: పంచాయతీ కార్యదర్శి.
కొండాపూర్ అక్టోబర్ 29(ప్రజావాణి):
మండల పరిధిలోని మనసానిపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 189లో చేపట్టిన ఫామ్‌హౌస్ నిర్మాణాలు, తాజాగా కొనసాగుతున్న భారీ భవనాల నిర్మాణ పనులపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత అనుమతులు, భూమి వినియోగ మార్పిడి ప్రక్రియ పూర్తయ్యాయా? పంచాయతీ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
నోటీసులకే పరిమితమైన గత చర్యలు?
గతంలో నిర్మించిన ఫామ్‌హౌస్ విషయంలో అప్పటి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడానికే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? పంచాయతీ రికార్డుల్లో భవనానికి సంబంధించిన వివరాలు నమోదయ్యాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. నోటీసులు జారీ చేసిన అనంతరం తదుపరి చర్యలు తీసుకున్నారా లేదా అన్నది కూడా ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అంశంగా మారింది.
నాలా కన్వర్షన్ లేకుండానే వ్యాపార కార్యకలాపాలా?
వ్యవసాయ భూమి వినియోగాన్ని మార్చేందుకు అవసరమైన నాలా కన్వర్షన్ అనుమతులు పొందారా? సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూమి వినియోగ మార్పిడి, నిర్మాణ అనుమతులు, ఇతర చట్టబద్ధమైన అనుమతుల వివరాలను అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.
ఎకరం భూమిలో భారీ భవనాలు.. పిల్లర్ల నిర్మాణం కొనసాగింపు!
ఇదే సర్వే నంబర్ పరిధిలో సుమారు ఎకరం భూమిలో కొత్తగా భారీ భవనాల నిర్మాణానికి పిల్లర్లు వేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్మాణాలకు గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా? లేక అనుమతులు పొందకుండానే పనులు చేపడుతున్నారా? అన్నది అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పంచాయతీ కార్యదర్శి వివరణ ఇదీ..
ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ, గతంలో నిర్మించిన ఫామ్‌హౌస్ పంచాయతీ రికార్డుల్లో లేదని, ఆ నిర్మాణం తన దృష్టికి రాలేదని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించిన ఫామ్‌హౌస్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే, ప్రస్తుతం పంచాయతీ అనుమతులు లేకుండా పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నట్లు గుర్తించిన వారికి పనులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఆదేశాలను పాటించకుండా పనులు కొనసాగిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఉన్నతాధికారులు స్పందించాలి.. సమగ్ర విచారణ చేపట్టాలి!
మనసానిపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 189లో గత నిర్మాణాల నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వరకు అన్ని అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి. భూమి వినియోగ మార్పిడి అనుమతులు, పంచాయతీ రికార్డులు, నిర్మాణ అనుమతులు, జారీ చేసిన నోటీసులు, వాటిపై తీసుకున్న చర్యలను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

