మంత్రి తుమ్మలను కలిసిన చేర్యాల మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తో కలిసి గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తనను నియమించి, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లకి కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ తనకు అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని, ఆ దిశగానే తాను కూడా చేర్యాల మార్కెట్ కమిటీ పరిధిలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు.
చేర్యాల మార్కెట్ యార్డ్‌లో రైతులకు కావాల్సిన అన్ని కనీస వసతులను కల్పిస్తామని, రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని, దళారుల ప్రమేయం లేకుండా పారదర్శక పద్ధతిలో కొనుగోళ్లు జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మార్కెట్ కమిటీ పరిధిలోని హమాలీలు, వ్యాపారుల సమస్యలను కూడా పరిష్కరించి, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు.
చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మార్కెట్ కమిటీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని, దీనికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు, నాయకులందరూ సహకరించాలని ఆయన కోరారు.

