* ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభతరం చేయాలి
* అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం అందించాలి
* రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
*మన ప్రజావాణి*
మంచిర్యాల జిల్లా
ప్రజలకు సంబంధించిన భూ సమస్యలను సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచకుండా, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్‌కుమార్, రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్లు, స్టాంపులు) ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్ లతో కలిసి హాజరై ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు దండే విఠల్,
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు, మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఖానాపూర్, ముధోల్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, పవార్ రామారావు పటేల్, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, రెవెన్యూ, గృహ నిర్మాణ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులతో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, భూ సంబంధిత అంశాలు, గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ భూములకు సంబంధించిన రికార్డులలో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా చూడాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వీలైనంత మేరకు సేవలను సులభతరం చేయాలని తెలిపారు
రెవెన్యూ శాఖకు సంబంధించి జిల్లాలో కొనసాగుతున్న భూ పరిపాలన, భూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారం, భూ సంబంధిత దరఖాస్తులస్వీకరణ–పరిష్కారం, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, భూ రికార్డుల నవీకరణ తదితర అంశాలపై సమీక్షించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, క్షేత్రస్థాయి పురోగతిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, రికార్డులలో మార్పులు, హక్కుల నమోదు, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందేలా చర్యలు చేపట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, గృహాల మంజూరు, నిర్మాణ ప్రారంభం, వివిధ దశలలో ఉన్న ఇండ్ల సంఖ్య, నిర్మాణాలు పూర్తి కాని కారణాలు, పెండింగ్‌లో ఉన్న గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఇప్పటికే మంజూరైన గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నిర్మాణాలు ప్రారంభం కాని ఇండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గృహ నిర్మాణాల పురోగతిని గ్రామ, మండల స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు అవసరమైన మార్గదర్శకత్వం, శాఖల మధ్య సమన్వయం అందించాలని సూచించారు. నిర్మాణాలు వివిధ దశలలో నిలిచిపోయిన చోట సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు జిల్లాల వారీగా భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ గృహ నిర్మాణాల పురోగతి, పెండింగ్ పనులు, ప్రజలకు అందుతున్న సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి జిల్లాలో ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని, ముఖ్యంగా పేదలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలతో పాటు అవసరమైన చోట అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని తెలిపారు
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేలా ప్రతి శాఖకు స్పష్టమైన కార్యాచరణ ఉండాలని, పెండింగ్‌లో ఉన్న పనులు, దరఖాస్తులు, నిర్మాణాలను గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలు అర్హులైన పేద కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా అమలవుతున్నందున, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని తెలిపారు అంతకుముందు నిర్మల్ జిల్లాలోని బాసర ప్రాంతంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి రహదారుల అభివృద్ధి పనులు, లోకేశ్వరం మండల కేంద్రం, దస్తురాబాద్ మండలం గొడిసెరాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

