బాల్య వివాహాల నివారణకు గ్రామసభలో ప్రతిజ్ఞ
దండేపల్లి, అక్టోబర్ 2 (ప్రజావాణి): పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా దండేపల్లి మండలం గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మేదరిపేట గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే పిల్లల్లో పెరుగుదల, అభివృద్ధి లోపాలను గుర్తించి, అవసరమైన వైద్య ఆరోగ్య సేవలకు రిఫర్ చేయడంపై అవగాహన కల్పించారు.
ఆరోగ్య శాఖ, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (RBSK) బృందాల సమన్వయంతో 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి మైలురాళ్లను నమోదు చేయనున్నట్లు తెలిపారు. పరిశీలనలో పెరుగుదల లేదా అభివృద్ధి లోపాలు ఉన్నట్లు గుర్తించిన పిల్లలను తక్షణమే అవసరమైన తదుపరి వైద్య సేవలు, చికిత్స కోసం సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం తల్లిదండ్రులు, సంరక్షకులు తమ 0–3 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మమత, సర్పంచ్ చొప్పదండి అనూష రాజేష్, కార్యదర్శి కళ్యాణ్, ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు సుజాత, పుష్పలత, సుమలత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

