📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపిన మాస్ లీడర్

ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపిన మాస్ లీడర్

📰 Generate e-Paper Clip

*ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపిన మాస్ లీడర్..!*
*సొంత నిధులతో కాలనీకి రోడ్డు వేసిన ఉప్పరి లక్ష్మణ్ సాగర్ కు జన నీరాజనం*

*ఏళ్లుగా బురదలోనే రాకపోకలు.. వర్షం వస్తే నరకయాతన.. చలించిన యువకుడు.. సొంత ఖర్చుతో దగ్గరుండి పనులు పూర్తి*

*సంజీవన్ రావుపేట్ లో ఆదర్శం.. యువతకు స్ఫూర్తిగా లక్ష్మణ్ సాగర్*

*నారాయణఖేడ్ (ప్రజావాణి ప్రతినిధి బాలరాజు) అక్టోబర్ 6:*

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక యువకుడి ఔదార్యం ఇప్పుడు అందరి నోటా నానుతోంది. ఎన్నికలప్పుడు వచ్చి హామీలిచ్చి వెళ్లిపోయే నాయకులు, ఫైళ్లలోనే అభివృద్ధిని చూపే అధికారులు చేయలేని పనిని.. సంజీవన్ రావుపేట్ గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మణ్ సాగర్ అనే యువకుడు చేసి చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

*ఏళ్లుగా కాలనీవాసుల కన్నీటి గాథ..*

నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట్ గ్రామంలోని తోట చివరి కాలనీలో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కాలనీకి సరైన రహదారి సౌకర్యం లేక వారు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల్లోనే నడవడం కష్టమైతే, వర్షాకాలం వస్తే ఆ కాలనీ పరిస్థితి వర్ణనాతీతం. రోడ్డంతా బురదమయమై మోకాలు లోతున నీళ్లు నిలిచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. పిల్లలు బడికి వెళ్లాలన్నా, అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా తీవ్ర అవస్థలు పడేవారు. ఈ సమస్యపై సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కాలనీవాసులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి జారుకున్నారు.
*సమస్య తెలుసుకుని చలించిపోయిన లక్ష్మణ్ సాగర్..*
అదే గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మణ్ సాగర్ కు కాలనీవాసుల దీనస్థితి తెలిసింది. వెంటనే స్పందించారు. “మన కళ్ల ముందు మన గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోకూడదు.. ప్రభుత్వం చేస్తుందని ఎదురుచూడడం కంటే మనకు చేతనైన సాయం మనమే చేయాలి” అని సంకల్పించారు.
వెంటనే తన సొంత నిధులు వెచ్చించి రంగంలోకి దిగారు. జేసీబీ, టిప్పర్లు, ట్రాక్టర్లను పిలిపించి, కంకర, మట్టి, మొరం తోలించి దగ్గరుండి మరీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అవసరమైన చోట్ల కొత్తగా రోడ్డు వేయించడంతో పాటు, పాత రోడ్డుకు మరమ్మతులు చేయించి కాలనీకి మంచి రహదారి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనులన్నీ కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేయించి తన మంచి మనసును చాటుకున్నారు.
*జనం నుంచి బ్రహ్మరథం..*
రోడ్డు పూర్తి కావడంతో తోట చివరి కాలనీలో పండగ వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా తమ కలగా ఉన్న రోడ్డు కల నెరవేరడంతో కాలనీవాసులు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. లక్ష్మణ్ సాగర్ ను ఘనంగా సన్మానించి, పూలమాలలు వేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, విద్యావేత్తలు, మేధావులు మాట్లాడుతూ.. “డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ తమ స్వార్థం కోసమే ఆలోచించే ఈ రోజుల్లో.. తన సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు చేసిన లక్ష్మణ్ సాగర్ నేటి యువతకు నిజమైన హీరో, ఆదర్శప్రాయుడు. అతని సేవా దృక్పథం అందరికీ స్ఫూర్తిదాయకం. ఇలాంటి యువకులు ప్రతి గ్రామంలో ఉండాలి” అని కొనియాడారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనిని ఒక సామాన్య యువకుడు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.