విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
మంగళవారం, జిల్లాలోని లింగాల ఘణపురం మండలంలోని వడ్డీచర్ల గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, సరుకుల నిల్వ గది, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.
పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులు వినియోగించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం, రుచికరమైన పౌష్టికాహారం అందించాలన్నారు.
పాఠశాలలో సరిపడా బెంచీలు లేని విషయాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే 15 బెంచీలు అందిస్తామని తెలిపారు. కొన్ని గదుల్లో తలుపులు, కిటికీలు పాడైపోయినట్లు గుర్తించిన కలెక్టర్, వాటి మరమ్మతులకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
విద్యార్థులు సాధారణ దుస్తుల్లో ఉండటాన్ని గమనించిన కలెక్టర్, వారికి ఏకరూప దుస్తులను అందించలేదా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఏకరూప దుస్తులను ధరించి, పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పాఠశాలలో ఖాళీగా ఉన్న గదులను శుభ్రం చేసి, వినియోగంలోకి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయురాలికి సూచించారు. విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పాఠశాలలో పనిచేస్తున్న ఆయా ఆరోగ్య పరిస్థితిపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. కంటి చూపు సరిగా కనిపిస్తుందా అని అడిగి తెలుసుకోగా, “బాగానే కనిపిస్తున్నాయి సార్” అని ఆమె తెలిపారు.
ఈ తనిఖీలో పాఠశాల హెచ్‌ఎం సరిత, పంచాయతీ సెక్రటరీ రమ్య, సర్పంచ్ సి.హెచ్. కార్తీక్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

