పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
అమరులైన పోలీసు కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది
పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి
సుల్తానాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, అక్టోబర్ 28
ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని తెలంగాణ చౌరస్తా వద్ద డీసీపీ బి. రామ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసుల సేవలు, త్యాగాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసుల ప్రాణత్యాగం బాధాకరమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన సైకిల్ ర్యాలీ తెలంగాణ చౌరస్తా నుంచి ప్రారంభమై తహసీల్దార్ కార్యాలయం, సివిల్ ఆసుపత్రి, శివాలయం, పాత జెండా, పోలీస్ స్టేషన్, రాజీవ్ రహదారి మీదుగా పూసాల ఎక్స్ రోడ్, వివేకానంద స్కూల్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి తెలంగాణ చౌరస్తాకు చేరుకోవడంతో ర్యాలీ ముగిసింది.
ఈ కార్యక్రమంలో ఎస్సైలు చంద్రకుమార్, మధుకర్, గట్ల సుధాకర్, సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సుల్తానాబాద్ మండల పాత్రికేయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

