పూడూరులో ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవ ఊరేగింపు

రూ.66 వేలకు అమ్మవారి లడ్డూ.. రూ.78 వేలకు డబ్బుల దండా వేలం
మేడ్చల్: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్లో ఉన్న పూడూరు గ్రామంలో దుర్గామాత నిమజ్జనోత్సవ ఊరేగింపును భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ పురోహితులు వెంకట్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేలంపాట చేపట్టారు. ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన తోకల రవి రూ.66 వేలకు అమ్మవారి లడ్డూను దక్కించుకున్నారు. అదేవిధంగా అమ్మవారికి సమర్పించిన డబ్బుల దండాను రాజబొల్లారం గ్రామానికి చెందిన కురకుల మహేష్ రూ.78 వేలకు కైవసం చేసుకున్నారు.
అనంతరం దుర్గామాత నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రారంభించారు. డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి మాలాధారులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం గ్రామంలోని ఎర్ర చెరువులో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గూడూరు శ్రీధర్ రెడ్డి, కంభం సుమన్, సాయితేజ, బీఆర్ఎస్ నాయకులు బాసుపల్లి రాంరెడ్డి, అకిటి నవీన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కోలా వెంకటేష్, డప్పు కృష్ణ, గ్రామస్తులు తుపాకుల తిరుపతి, తుపాకుల దేవేందర్, తాళ్ల మురళిరెడ్డి, దుండిగాళ్ల శంకర్, జి. పరమేష్, శేషి కుమార్, మహేందర్, కటకం లక్ష్మణ్, రాజేందర్, విఠల్‌తో పాటు భవానీమాత మాలాధారులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

