*అక్రమ వైద్య కేంద్రాలపై డీఎంహెచ్ఓ కొరడా.. బోడుప్పల్లో క్లినిక్ సీజ్*
*ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్లో ఆకస్మిక తనిఖీలు*
*అర్హతలు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు: డాక్టర్ కె. ఆనంద్*
మేడ్చల్ నేటి ప్రస్థానం:- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో చట్టవిరుద్ధంగా వైద్య సేవలు అందించే కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె. ఆనంద్ ఆధ్వర్యంలో ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, పీసీపీఎన్డీటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా రామంతాపూర్‌లోని శ్రీ గాయత్రి కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. పీసీపీఎన్డీటీ చట్టంలోని నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించడంతోపాటు చట్టబద్ధమైన విధానాలను అనుసరించాలని ఆదేశించారు.
అనంతరం ఉప్పల్‌లోని యూవీ డయాగ్నస్టిక్ సెంటర్లో తనిఖీలు నిర్వహించి, కేంద్రం నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. బోడుప్పల్‌లోని మమత క్లినిక్‌ను తనిఖీ చేయగా, అవసరమైన రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు, వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తికి అవసరమైన అర్హతలు లేనట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిబంధనల ప్రకారం సదరు క్లినిక్‌ను తక్షణమే సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ కె. ఆనంద్ మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అవసరమైన అనుమతులు లేకుండా వైద్య కేంద్రాలను నిర్వహించడం, అర్హతలు లేని వ్యక్తులు వైద్య సేవలు అందించడం, పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు, అవసరమైన అనుమతులు పొందాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆయన సూచించారు. నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ కొనసాగుతాయని తెలిపారు.
ఈ తనిఖీల్లో కీసర డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత, జిల్లా ఎంసీహెచ్/సీఐఏ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ గీత, అదనపు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పవన్ రెడ్డి, డిప్యూటీ డెమో శ్రీమతి వసంత కుమారి పాల్గొన్నారు.


