📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ*కల్తీ ఆహారంతో ప్రాణాలు పోతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు

*కల్తీ ఆహారంతో ప్రాణాలు పోతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు

📰 Generate e-Paper Clip

*కల్తీ ఆహారంతో ప్రాణాలు పోతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు?

*ఆహారం కల్తీపై ఉక్కుపాదం మోపాలి*

*ప్రతి హోటల్‌లో ఫిర్యాదు నంబర్లు తప్పనిసరి చేయాలి*

*ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు*

*ఆహార భద్రత చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: మెట్టు శ్రీధర్ డిమాండ్*

పటాన్‌చెరు, అక్టోబర్ 17(ప్రజావాణి):ఆకలి తీర్చాల్సిన హోటళ్లలో కల్తీ ఆహారం ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర కార్యదర్శి డా. ఏర్పుల శ్రీనివాస్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో మండి బిర్యానీ తిన్న 19 ఏళ్ల సాయిరామ్ మృతి చెందడం, మరో 19 మంది అస్వస్థతకు గురైనట్లు వెలువడిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, చిరుతిళ్ల దుకాణాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై నిరంతర తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి హోటల్‌లో ఆహార కల్తీపై ఫిర్యాదు చేసేందుకు సహాయవాణి నంబర్లు, వాట్సాప్ నంబర్లు, సంబంధిత అధికారుల వివరాలతో కూడిన సమాచార బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కల్తీకి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006ను పటిష్టంగా అమలు చేయాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. నాణ్యత లేని ఆహారం విక్రయించినా, అపరిశుభ్ర పరిస్థితుల్లో వంటకాలు తయారు చేసినా చట్టప్రకారం జరిమానాలు విధించాలని, కల్తీ ఆహారం కారణంగా ప్రాణనష్టం జరిగితే బాధ్యులపై కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోరారు. అవసరమైతే హోటళ్ల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు నిత్యం హోటళ్ల ఆహారంపై ఆధారపడుతున్నారని, వారి ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లలో ఆహార కల్తీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆహార నాణ్యతపై ఫిర్యాదులకు తెలంగాణ ఆహార భద్రత విభాగం వాట్సాప్ నంబర్ 91001 05795ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం కేవలం ఉత్తర్వులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసి కల్తీ ఆహార విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని మెట్టు శ్రీధర్, డా. ఏర్పుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.