ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో
ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు,ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాలయ అమావాస్య సందర్భంగా నేటి నుంచి ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు తెలంగాణ ఆడబిడ్డలు పూల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. తంగేడు,గునుగు,బంతి, చామంతి,కట్ల,గుమ్మడి, తామర వంటి రకరకాల ఔషధ గుణాలున్న పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలవడం ఈ పండుగ ప్రత్యేకత.ఇందులో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు సంప్రదాయబద్ధంగా,ఉదయం నుంచే ఇంటిని పూలతో అలంకరించి, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై గునుగు, తంగేడు పూలతో చిన్న బతుకమ్మలను పేర్చారు. ఎంగిలిపూల బతుకమ్మ ఆనవాయితీ ప్రకారం నువ్వులు,బియ్యంపిండి,నూకలతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించారు.అనంతరం బతుకమ్మ చుట్టూ చేరి “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..” అంటూ జానపద పాటలు పాడుతూ ఆడిపాడారు.బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని,తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రతి ఏటా ఇంట్లో అందరి ఆడబిడ్డలతో కలిసి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ప్రకృతిని,పూలను పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణకే సొంతమని తెలిపారు.వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని,రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని గౌరమ్మను కోరుకున్నట్లు చెప్పారు.ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు.

