*సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని నియమించాలంటూ విద్యార్థుల రాస్తారోకో*
ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17:
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి పోస్టును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు గురువారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
గత రెండు సంవత్సరాలుగా తమ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమైన సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని తల్లిదండ్రులు ఆరోపించారు.
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని నియమించే వరకు ధర్నా విరమించేది లేదని విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి స్పష్టం చేశారు. దీంతో కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని నియమించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు.

