శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా అడికెష్ లింగమయ్య పాదయాత్ర.
కోటగిరి/ప్రజావాణి:-శ్రావణ మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని ధర్మజాగరణ వేదిక ఆధ్వర్యంలో ప్రతిఏటా నిర్వహించే పవిత్ర పాదయాత్ర ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరిగింది.శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామి దివ్యసన్నిధిలో వారి ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఎత్తొండ గ్రామం నుంచి అడికెష్ లింగమయ్య స్వామి క్షేత్రం వరకు ఈ పాదయాత్ర సాగింది.భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేశారు. ప్రభాకర్,సాయి బృందం అందించిన భజన కార్యక్రమాలు, శివ కీర్తనలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.దారి పొడవునా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే ఎక్లాస్పూర్ గ్రామస్తులు తగిన ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా శ్రావణ చివరి సోమవారం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొని లింగమయ్య స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దిండి ప్రముఖ్ బాబు మహారాజ్ (ఎత్తొండ), ధ్వజ ప్రముఖ్ వల్లభాపూర్ హంసల అశోక్,కోటగిరి మండల సర్పంచ్ల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,ఎత్తొండ గ్రామ సర్పంచ్ సూర్యకాంత్,అంబం సర్పంచ్ కూనేపల్లి గంగాధర్, ఎత్తొండ,కోటగిరి,ఎక్లాస్పూర్,కొత్తపల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు,పలువురు ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు పెద్దఎత్తున ఈ యాత్రలో పాల్గొన్నారు.

