శివాలయం సెంటర్లో 40 అడుగుల మట్టి వినాయక విగ్రహం
*ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు*
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం నగరంలోని శివాలయం సెంటర్ బ్రాహ్మణ బజార్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శివాలయ సెంటర్ ప్రకృతి సిద్ధ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోనే అతి పెద్దదైన 40 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాలను మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా సాయి ప్రసన్న మాట్లాడుతూ.. 1994 సంవత్సరం నుంచి 2026 వరకు ప్రతి సంవత్సరం ప్రకృతి సిద్ధమైన మట్టితో భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం తమ కమిటీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం వినూత్నంగా, భారీ ఆకారంలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం ఖమ్మం నగరంలోనే అతిపెద్ద వినాయక విగ్రహంగా నిలిచిందని అన్నారు.
భారీ గణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయం సెంటర్కు తరలివస్తున్నారని తెలిపారు. కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గణపతి ఆశీస్సులు పొందుతున్నారని చెప్పారు.
వినాయక ఉత్సవాల సందర్భంగా శివాలయం సెంటర్ పరిసర ప్రాంతం భక్తులతో సందడిగా మారింది. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. గణనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
“ప్రకృతి సిద్ధమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించడం ద్వారా భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా లక్ష్యం” అని నిర్వాహకులు తెలిపారు.
వినాయక చవితి ఉత్సవాలు విజయవంతంగా కొనసాగేందుకు భక్తులు, ప్రజలు సహకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.


