నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి వినాయక నిమజ్జన/ఊరేగింపు సందర్భంగా దళిత యువకుడు పోతేపాక సాయి కుమార్‌పై దాడి జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోతేపాక సాయి కుమార్‌ను పాలడుగు నాగార్జున, గాదె నరసింహలు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బాధితుడి వాంగ్మూలం ప్రకారం తండు వరుణ్, పండు వేణు, తండు వెంకన్న, తండు లింగయ్యతో పాటు మరికొందరు వ్యక్తులు దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ కత్తితో ఎడమ పక్క భాగంలో పొడిచి, గొంతు కోసినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించి, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులు, గిరిజనులపై దాడులు, కులం పేరుతో దూషణలు, బెదిరింపులు చోటుచేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని నాగార్జున అన్నారు. కులవివక్ష, దాడులకు పాల్పడే వ్యక్తులను చట్టపరంగా కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించి సమగ్ర విచారణకు ఆదేశించాలని, నేరం చేసినట్లు దర్యాప్తులో తేలిన వారిని వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, బాధితుడి వాంగ్మూలం, సాక్ష్యాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పూర్తిగా పరిశీలించి కేసు దర్యాప్తు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. నేరం నిర్ధారణకు అనుగుణంగా హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని వర్తించే నిబంధనలతో పాటు ఇతర వర్తించే చట్టాల కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి రక్షణ కల్పించాలి. దాడి నేపథ్యంలో బాధితుడు సాయి కుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి బెదిరింపులు లేదా ఒత్తిళ్లు లేకుండా తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం/సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కుక్కడం గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకుని బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని కెవిపిఎస్ తరఫున పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ, రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

