*తాటిపెల్లిలో వారంలోనే కూలిన డ్రైనేజీ గోడ*
*- నాసిరకం పనులపై బీజేపీ నేత సుంకపాక టైటస్ ఆగ్రహం*
*మల్యాల, సెప్టెంబర్ 24 (మన సమగ్ర ప్రజావాణి):*
మల్యాల మండలం తాటిపెల్లి గ్రామంలోని ఓర్రెలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ రక్షణ గోడ (సిమెంట్ కాలువ) నాసిరకం నిర్మాణం వల్ల కట్టిన వారానికే కూలిపోయిందని బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు సుంకపాక టైటస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క చిన్న వర్షానికే అవినీతి బట్టబయలైందని, వరి పొలాల పక్కనే నిర్మించిన ఈ డ్రైనేజీ కాలువను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించలేదని, కేవలం బిల్లులు డ్రా చేసుకోవడానికే ఇలాంటి నాసిరకం పనులు చేశారని ఆయన ఆరోపించారు. సిమెంట్, ఇసుక మిశ్రమం సక్రమంగా వాడకపోవడం వల్లే కట్టిన 7 రోజులకే గోడలు బీటలు వారి కుప్పకూలాయని పేర్కొన్నారు.
అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల స్వార్థం వల్ల లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయిందని మండిపడ్డారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఈ నాసిరకం పనులపై తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులైన కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని సుంకపాక టైటస్ హెచ్చరించారు.

