*రోడ్లపై యువత చక్కర్లు.. చేజారుతున్న భవిష్యత్తు!*
*రాయికల్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి):*
మండలంలోని పలు గ్రామాల్లో యువత దారి తప్పుతోంది. చదువు, ఉపాధి, ఎలాంటి పని లేకుండా రోజంతా బైకులు పట్టుకుని రోడ్ల మీద అటూ ఇటూ చక్కర్లు కొడుతూ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. చేతిలో సెల్ ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్లు, మితిమీరిన వేగంతో బైక్ రేసులు, విన్యాసాలు చేస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును తమ చేతులారా నాశనం చేసుకుంటున్నారు.ఉదయం నుంచి రాత్రి వరకు కూడళ్లలో, ప్రధాన రహదారులపై, ఖాళీ ప్రదేశాల్లో గుంపులుగా చేరి అరుపులు,కేకలు, హారన్ మోతలతో హల్ చల్ చేస్తున్నారు. చాలా మంది విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లకుండా బంగ్ కొట్టి బైకులపై తిరుగుతున్నారు. తల్లిదండ్రులు కష్టపడి కొనిచ్చిన బైకులను దుర్వినియోగం చేస్తూ, పెట్రోల్ కోసం ఇంట్లో గొడవలు పడుతూ, చెడు వ్యసనాలకు బానిసలవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.ఈ నిర్లక్ష్యపు తిరుగుళ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ తో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల మండలంలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలకు యువత నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని స్థానికులు చెబుతున్నారు. తమ పిల్లలతో పాటు ఎదురుగా వచ్చే అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు.యువత ఇలా గాలికి తిరగడానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే ప్రధాన కారణమని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు బైకులు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచించాలని, వారి నడవడికను గమనించాలని సూచిస్తున్నారు.యువత తమ శక్తి సామర్థ్యాలను ఇలా రోడ్లపై వృధా చేసుకోకుండా చదువు, క్రీడలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని, పోలీసు, విద్యా శాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావాలని మేధావులు, గ్రామ పెద్దలు కోరుతున్నారు.

