నంగునూరు, సెప్టెంబర్ 9 (ప్రజావాణి):
రైతులకు ప్రస్తుతం అందిస్తున్న 10 గంటల విద్యుత్ సరఫరా సరిపోవడం లేదని, విద్యుత్ అంతరాయాలు లేకుండా కనీసం 18 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సిద్దిపేట విద్యుత్ శాఖ ఎస్‌ఈ అధికారికి బుధవారం మెమొరాండం అందజేశారు. రైతుల సమస్యలను పరిష్కరించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని కోరారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు సకాలంలో నీరు అందించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం అందుతున్న 10 గంటల విద్యుత్ సరఫరా కూడా నిరంతరంగా ఉండటం లేదని, దీంతో బోర్లు, వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయక పంటలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ కోతలు ఏర్పడితే సాగునీటి సమస్య తలెత్తి దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీసం 18 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ద్వారా పంటలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంగునూరు మండలం నుంచి భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా పత్తి ప్రముఖ్ జీడిపల్లి రజినీకర్ రెడ్డి, కట్కూరి భూపాల్ రెడ్డి, ముత్తయ్య, గారి వెంకట్ రెడ్డి, చిలుకల తిరుపతి రెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

