ఘట్కేసర్, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్లో ‘అప్డేటింగ్ ప్యార్’ చిత్రం విడుదలైంది. ఘట్కేసర్లోని పాత గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చిత్రాన్ని యూట్యూబ్లో అధికారికంగా విడుదల చేశారు.
నేటి యువతలో మారుతున్న ప్రేమ సంబంధాలు, సహజీవనం, వివాహానికి ముందే గర్భం దాల్చిన సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి, సామాజిక పరిస్థితులు, మానసిక సంఘర్షణలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవ జీవితంలో చోటుచేసుకునే సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించిన ఈ చిత్రం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.
‘కళల భానుడు’ యూట్యూబ్ ఛానల్ ద్వారా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. వినాయక చవితి రోజున ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతుల మీదుగా చిత్రం విడుదల కావడం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు షేను భాను చందర్, హీరో మహేష్, హీరోయిన్ సుష్మిత గిరిధారి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మేకల నర్సింగ్ రావుతో పాటు చిత్ర బృంద సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
చిత్రాన్ని ‘కళల భానుడు’ యూట్యూబ్ ఛానల్లో వీక్షించి ఆదరించాలని దర్శకుడు, చిత్ర బృందం ప్రేక్షకులను కోరింది.


