📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyమంచాల గ్రామంలో పడకేసిన పరిశుభ్రత

మంచాల గ్రామంలో పడకేసిన పరిశుభ్రత

📰 Generate e-Paper Clip

*మంచాల గ్రామంలో పడకేసిన పరిశుభ్రత*

•• *పంచాయతీ అధికారులు పట్టించుకోని వైనం.*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ప్రజావాణి సెప్టెంబర్ 18:

మంచాల గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో పాటు పలు వార్డుల్లో గడ్డి విపరీతంగా పెరిగిపోయి దోమల బెడద ఎక్కువైందని చెబుతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో ఊరి చివరలో రోడ్డుకు ఇరువైపులా చెత్త వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తడి, పొడి చెత్తను సేకరించే గ్రామపంచాయతీ వాహనానికి డీజిల్ లేకపోవడంతో చెత్త సేకరణకు అంతరాయం కలుగుతోందని ఆరోపిస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇతర అవసరాలకు డీజిల్ అందుబాటులో ఉంటున్నప్పుడు గ్రామపంచాయతీ చెత్త వాహనానికి డీజిల్ లేకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలు వార్డుల్లో గడ్డి పెరిగిపోవడం, పరిసరాలను శుభ్రం చేయకపోవడం వల్ల దోమల బెడద పెరిగిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు టైఫాయిడ్, మలేరియా తదితర జ్వరాలు వస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా విషపూరితమైన పాములు ఇళ్లలోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగినప్పుడు అవసరమైన ప్రథమ చికిత్స కిట్లు, భద్రతా పరికరాలు అందుబాటులో ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు. సిబ్బందికి గ్రామపంచాయతీ తరఫున ఐడీ కార్డులు, ఆరోగ్య బీమా కార్డులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంచాల గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించేందుకు ఎంపీడీవో స్వయంగా గ్రామాన్ని సందర్శించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పనితీరుపై ఉన్న ఫిర్యాదులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామపంచాయతీలో అటెండర్ విధులు, పారిశుద్ధ్య నిర్వహణలో వారి బాధ్యతలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమ ఇళ్లకు వచ్చిన వార్డు సభ్యులు గెలిచిన తర్వాత వార్డుల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని కొంతమంది స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను కలిసిన వార్డు సభ్యులు ప్రస్తుతం తమ వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.మంచాల గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి, చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత, దోమల నివారణతో పాటు పచ్చిక తొలగింపు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.