“బైరాన్‌పల్లి” అమరుల త్యాగాలను వృథా కానివ్వం
17 సెప్టెంబర్‌ను అధికారికంగా నిర్వహించాలి..
బైరాన్‌పల్లి,గుండ్రాంపల్లి పోరాట ఖిల్లాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి
సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
మద్దూరు సెప్టెంబర్ 16, ప్రజా వాణి,
భారతదేశానికి పోరాటాలతో ఓనమాలు నేర్పింది కమ్యూనిస్టు పార్టీ అని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 78వ వారోత్సవాల్లో భాగంగా బుధవారం బైరాన్‌పల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం, చారిత్రక బురుజు వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బురుజు వద్ద స్థానిక మండల కన్వీనర్ వలబోజు నర్సింహా చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, ధన, మాన, ప్రాణ దోపిడీలకు వ్యతిరేకంగా బైరాన్‌పల్లి ప్రజలు సాగించిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. 118 మంది అమరులైన బైరాన్‌పల్లి నెత్తుటి చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లి వంటి పోరాట ఖిల్లాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి స్మృతి చిహ్నాలుగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నాటి పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు అందించాలని కోరారు.ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ శాసనసభాపక్ష నేత చాడ వెంకటరెడ్డి గతంలో పలుమార్లు ప్రభుత్వాలకు లిఖితపూర్వకంగా వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.1946 జూలై 4న తొలి అమరుడు దొడ్డి కొమురయ్య నుంచి వేలాది మంది యోధులు నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారని నాయకులు తెలిపారు. లక్షలాది ఎకరాల భూమిని
పేదలకు పంచి, అనేక గ్రామాలను నిజాం పాలన నుంచి విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టు ఉద్యమానిదేనన్నారు. 17 సెప్టెంబర్‌ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ విమోచన చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. ప్రజలతో కలిసి కమ్యూనిస్టులు సాగించిన పోరాటాల ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మద్దూరు మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, బెక్కంటి సంపత్, నంగి కనకయ్య, బైరాన్ పల్లి శాఖ కార్యదర్శి ఆరుగొండ మల్లేష్,గూడెపు సుదర్శన్, దండబోయిన వెంకటేష్, గోమరపు నర్సయ్య, బంగారు ప్రేమ్ కుమార్, శిగుళ్ల నరేష్, నంగి సత్తయ్య, కాశబోయిన చరణ్, మహిళా, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

