📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు షాక్: కాశినాయన మండలంలో వాగు పోరంబోకు ముళ్లకంచెలు తొలగించిన రెవెన్యూ అధికారులు!

ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు షాక్: కాశినాయన మండలంలో వాగు పోరంబోకు ముళ్లకంచెలు తొలగించిన రెవెన్యూ అధికారులు!

📰 Generate e-Paper Clip

గొంటువారిపల్లెలో రంగంలోకి దిగిన తహసీల్దార్.. మాజీ సర్పంచ్ అనుచరుల అక్రమ సాగుపై కొరడా!

శ్రీ అవధూత కాశినాయన సెప్టెంబర్ 30ప్రజావాణి మండలం:ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు మరోసారి నిరూపించారు. శ్రీ అవధూత కాశినాయన మండల పరిధిలోని గొంటువారిపల్లె గ్రామ పంచాయితీలో బుధవారం భారీ ఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ బోవిళ్ళ పిచ్చిరెడ్డి ప్రధాన అనుచరుడు బోవిళ్ళ నరసింహారెడ్డి అక్రమంగా నిర్మించిన ముళ్లకంచెలను తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో ధ్వంసం చేశారు.

నిబంధనలు బేఖాతరు.. బోర్డు ఉన్నా బరితెగింపు!స్థానిక గొంటువారిపల్లె గ్రామ పంచాయితీ పరిధిలోని సర్వే నెంబర్లు 171-1, 172-2, మరియు 174-1 లలో దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిపై రాజకీయ బలంతో ఆక్రమణదారులు కన్నేశారు. గతంలోనే ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించినదని, ఎవరూ ఆక్రమించరాదని హెచ్చరిస్తూ తహసీల్దార్ కార్యాలయ అధికారులు అక్కడ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఆ ప్రభుత్వ హెచ్చరికల బోర్డును కనీసం లెక్కచేయకుండా ఆక్రమణదారు బోవిళ్ళ నరసింహారెడ్డి సదరు భూమి చుట్టూ ముళ్లకంచె వేసి, ఏకంగా పసుపు, ఉలవ పంటలను సాగు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ భూమిని తమ సొంత ఆస్తిగా భావిస్తూ ధైర్యంగా సాగు చేసుకుంటుండటంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

అధికారుల మెరుపు దాడి.. కంచెలు సాఫ్!

వాగు పోరంబోకు భూమి అక్రమంగా సాగు అవుతోందన్న పక్కా సమాచారంతో స్పందించిన తహసీల్దార్ తక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రెవెన్యూ సిబ్బంది, గ్రామ వీఆర్వోలు ఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణలో ఉన్న 12 ఎకరాల చుట్టూ వేసిన ముళ్లకంచెలను పూర్తిగా తొలగించారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ప్రజల డిమాండ్: ‘పంటలు పూర్తిగా తొలగించి, హద్దులు పెట్టాలి‘

కేవలం ముళ్లకంచెలు తొలగిస్తే సరిపోదని, ఆక్రమణదారులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ సర్వేయర్ ద్వారా సదరు సర్వే నెంబర్లలోని 12 ఎకరాల భూమికి పూర్తిస్థాయిలో కొలతలు వేసి, ప్రభుత్వ హద్దు రాళ్లను నాటాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ హెచ్చరికలను ధిక్కరించి వేసిన పసుపు, ఉలవ పంటలను కూడా పూర్తిగా తొలగించి, ఆక్రమణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. సహజ వనరులైన వాగులను కాపాడటంలో అధికారులు ఇలాగే నిరంతరం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.