*ప్రజల భద్రతే పోలీసుల తొలి బాధ్యత!*
స్టేషన్‌కు ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. గ్రామాలపై నిఘా నుంచి రాత్రి గస్తీ వరకు సమీక్ష!
112కు కాల్ వస్తే ఆలస్యం వద్దు.. ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా వినాలి!
మాదకద్రవ్యాల కట్టడితో పాటు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి!
కేసముద్రం, సెప్టెంబర్ 26, ప్రజావాణి.
పోలీసులు స్టేషన్‌లో ఉండటం మాత్రమే కాదు.. ప్రజల మధ్య ఉండాలి. గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో ఒక్క ఫోన్‌కాల్‌కు స్పందించి అండగా నిలవాలి. పోలీస్–ప్రజల మధ్య నమ్మకమే బలమైన భద్రతా వ్యవస్థకు పునాది కావాలనే దిశగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.కేసముద్రం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ.. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత నుంచి కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, సిబ్బంది విధుల వరకు సమగ్రంగా పరిశీలించారు. ఎస్‌ఐ క్రాంతి కిరణ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
*గ్రామంలో పోలీస్.. ప్రజలకు భరోసా!*
ప్రతి సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించాలని ఎస్పీ సూచించారు. గ్రామాల్లోని స్థానిక సమస్యలు, నేర ప్రవృత్తులు, అనుమానాస్పద కార్యకలాపాలపై ముందుగానే సమాచారం సేకరిస్తే నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.విపిఓ లు గ్రామస్థులతో నిరంతరం మమేకమై ఉండాలని, ముఖ్యమైన పరిణామాలు, నేరాలకు సంబంధించిన సమాచారం, ప్రజల సమస్యలను పోలీస్ స్టేషన్‌కు ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు.రాత్రి గస్తీని పటిష్టం చేయాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112కు వచ్చే కాల్స్‌పై తక్షణమే స్పందించి బాధితులకు అవసరమైన పోలీస్ సహాయం అందించాలని స్పష్టం చేశారు.

*పోలీస్ స్టేషన్.. సమస్య చెప్పుకునే స్థలం!*
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు తమ సమస్యను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం ఉండాలని ఎస్పీ సూచించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విసిటింగ్ అవర్స్ ను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదును ఓపికగా విని, నిబంధనల ప్రకారం సత్వర స్పందన అందించాలని ఆదేశించారు.మాదకద్రవ్యాల ప్రభావం యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిఘా పెంచాలని ఎస్పీ సూచించారు. గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.మహిళలు, బాలల భద్రతతో పాటు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలపై గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు.
*ప్రజలతో మమేకమై.. భద్రతకు భరోసాగా!*
నేరం జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా.. నేరం జరగకుండా ముందస్తు సమాచారం సేకరించడం, గ్రామాల్లో అందుబాటులో ఉండడం, ప్రజల సమస్యలను వినడం, అత్యవసర సమయంలో వేగంగా స్పందించడం పోలీసింగ్‌లో కీలకమని ఎస్పీ సూచనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా క్రమశిక్షణతో, బాధ్యతతో, మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సిబ్బందికి డా. శబరీష్ దిశానిర్దేశం చేశారు.

