*పోషకాహారంతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం*
*సిద్ధన్నపేటలో ఘనంగా పోషణ మాసోత్సవం*
నంగునూరు, సెప్టెంబర్ 28 :
పోషకాహారంతో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని నంగునూరు తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డి అన్నారు.
పోషణ అభియాన్లో భాగంగా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో సోమవారం పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు కత్తుల గంగా భవాని, కాచగోని లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్ఐ లింగం, ఏపీఎం శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి అనితా రెడ్డి, గ్రామ సర్పంచి సంగు పురేందర్, ఉప సర్పంచి చిలుకల తిరుపతి రెడ్డి, ఐసీడీఎస్ ఏసీడీపీఓ హరిత, పర్యవేక్షకురాలు రజిత, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం ద్వారా శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు ఆరోగ్య కరమైన జీవనానికి పునాది పడుతుందని తెలిపారు. ముర్రు పాల(తల్లి మొదటి పాలు) ప్రాముఖ్యతను వివరించారు. శిశువు జన్మించిన వెంటనే లభించే ముర్రుపాలు శిశువుకు అవసరమైన పోషకాలు, రోగ నిరోధక శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్న ప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో కార్యక్రమంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
పోషణ మాసోత్సవంలో భాగంగా తల్లులు, పిల్లలు, గ్రామస్తులకు ఆరోగ్యం, పోషణ, పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నారులకు సరైన పోషకాహారం అందించడం, గర్భిణీలు వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం, పిల్లల ఎదుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ అధికారులు, వైద్యులు, ముండ్రాయి సెక్టార్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో తల్లులు, పిల్లలు, గ్రామస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తల్లి ఆరోగ్యం – శిశువు ఆరోగ్యం – కుటుంబ ఆరోగ్యం – సమాజ ఆరోగ్యం అనే లక్ష్యంతో పోషకాహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

